0

పిడికెడు ఆత్మగౌరవం కోసం..

Posted by Chaithanya on 23:18 in

"పిడికెడు ఆత్మగౌరవం కోసం.." by కలేకూరి ప్రసాద్
-------------------------------------------------------

నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ
వేల ఏళ్ల క్రితం ఈ గడ్డమీదనే చంపబడ్డాను

‘పునరపి మరణం పునరపి జననం’
నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ
మళ్లీ మళ్లీ మరణించిన
చోటనే పుడుతున్నాను
నాదేశం ఈ దేశంలో కరిగిపోయి
గంగా సింధూ మైదానమయ్యింది
నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే
ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి

నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే
ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది

త్రేతాయుగంలో నేను శంభూకుణ్ని
ఇరవై రెండేళ్ల క్రితం
నా పేరు కంచికచర్ల కోటేశు
నా జన్మస్థలం కీలవేణ్మణి,
కారంచేడు, నీరుకొండ
ఇప్పుడు కరుడుకట్టిన భూస్వామ్య క్రౌర్యం
నా గుండెల మీద నాగేటి కర్రులతో
పచ్చబొడిసిన పేరు చుండూరు
ఇక చుండూరు నామవాచకం కాదు
సర్వనామం

ఇప్పుడు ప్రతి గుండే ఒక చుండూరు,
రగిలే రాచపుండూరు
నేను జన సమూహాల గాయాన్ని
గాయాల సమూహాన్ని
తరతరాలుగా స్వతంవూతదేశంలో
అస్వతంవూతుణ్ణి
అవమానాలకూ, అత్యాచారాలకూ,
మానభంగాలకూ, చిత్రహింసలకూ గురై
పిడికెడు ఆత్మగౌరవం కోసం తలెత్తిన వాణ్ణి
ధనమదాంధ కులోన్మత్తుల రాజ్యంలో
బతకడమే ఒక నిరసనగా బతుకుతున్న వాణ్ణి
బతికేందుకు పదేపదే చస్తున్నవాణ్ణి

నన్ను బాధితుడని పిలువకండి
నేను అమరుణ్ణి,
నేను అమరుణ్ణి నేను అమరుణ్ణి!

లోకానికి సంపదల్ని మిగిల్చేందుకు
క్షామాన్ని మింగిన
గరళ కంఠుణ్ణి నేను
శీర్షాసనం వేసిన సూర్యోదయాన్ని
నిటారుగా నిలబె
సూర్యుడి నెత్తి మీద యీడ్చితన్నిన వాణ్ణి
రగిలే గుండె కొలిమిలో
నినాదాలు కురిపిస్తున్న వాణ్ణి

నాకు జాలిజాలి మాటలొద్దు
కన్నీటి మూటలొద్దు
నేను బాధితుణ్ణి కాదు అమరుణ్ణి
ఎగిరే ధిక్కార పతాకాన్ని

నాకోసం కన్నీరు కార్చకండి
మీకు చేతనైతే
నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి

జీవన రవళిని వినిపించే
వెదురువనాన్నయి వికసిస్తాను

నా శవాన్ని ఈ దేశం
ముఖచివూతంగా ముద్రించండి
చరిత్ర పుటల్లోకి సుందర
భవిష్యత్తునై పరివ్యాపిస్తాను

ఒక పెనుమంటల పెనుగులాటనై
మళ్లీ మళ్లీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను



0 Comments

Post a Comment

Copyright © 2009 Chaithu's Library All rights reserved. Theme by Laptop Geek. | Bloggerized by FalconHive.